sparrows with retirement money : రిటైర్మెంట్ డబ్బుతో పిచ్చుకల కోసం ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే షాక్ అవుతారు ..!!
ఈ రోజుల్లో పిచ్చుకలు చాలా వరకు కనిపించటమే లేదు. పిచ్చుకలను కాపాడటానికి ఈ రిటైర్డ్ టీచర్ సృజనాత్మకంగా కృషి చేస్తున్నారు. రిటైర్ మెంట్ తో వచ్చిన డబ్బులు ఈ బుల్లి పిట్టలకి గింజలు పెట్టటానికి ఖర్చు చేస్తున్నారు. ఆ టీచర్ పేరు పోలివర్తి దాలి నాయుడు. పిచ్చుకల ఉనికి ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి సహాయపడుతుందని చెప్పారు. ఈ రిటైర్డ్ టీచర్ ఈ బుల్లి పిచ్చుకల పరిరక్షణ కోసం హరిత వికాస ఫౌండేషన్ పేరుతో సంస్థలు కూడా స్థాపించాడు.
కాకినాడ జిల్లా తునికి చెందిన దాలి నాయుడు హిందీ పంతులుగా రిటైర్ అయ్యాడు. టీచర్ గా పని చేస్తున్నప్పటి నుంచి ఆయన జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఊరు ఊరు తిరిగి పిచ్చుకల కోసం వరి ధాన్యం కుంచెలు కట్టటం మొదలుపెట్టారు.. ఇప్పుడు పల్లెటూర్లో కూడా కుంచెలు కట్టే విధానం చాలా తగ్గిపోయింది. ఆయన హిందీ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు సుబ్బారావు అనే ఒకాయన దగ్గర నేర్చుకున్నారు.
నేను నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి నేర్పుతాను. దానివల్ల పక్షుల సంఖ్య పెరుగుతుంది. పిచ్చుకలతో పాటు ఉడతలు, రామచిలుకలు ఇవన్నీ జీవవైవిద్యానికి భూమికి ఎంతో మేలు చేస్తుంది అని దాలి నాయుడు తెలియజేశారు. ఇలా పక్షులకు ఆహారం అందించటం తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పిచ్చుకల కోసం స్వయంగా తన ఎకరం పొలంలో వరి పండిస్తున్నారు.ఈ పంటను కేవలం ధాన్యం కుంచెలు కట్టటానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
ఈ కుంచెలు కట్టేందుకు సహాయపడిన వారికి కొంత డబ్బులు ఇచ్చారు. ఈ పంట సాగు కోసం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు దాకా ఖర్చు చేస్తారు. ఇదంతా పిచ్చుకలను కాపాడటానికి చేస్తున్నాను అని తెలిపారు.ఆయన 9 రకాల కుంచెలు కట్టడం నేర్చుకున్నారు. దానిని పొలిమేరు గ్రామంలో మరో 12 మందికి నేర్పించారు. మరో 8 మందికి కూడా నేర్పారు. వాళ్లు డిఫరెంట్ మోడల్ లలో తయారు చేస్తారు. వారు ఒక నెల రోజులపాటు ఈ కుంచెలు కడతారు. ఆయన పెన్షన్ డబ్బులు కూడా వాటి కోసమే ఖర్చు చేస్తాను అని ఆయన తెలిపారు..
పిచ్చుకల సంరక్షణ వల్ల కలిగే మేలు గురించి విస్తృతంగా చేస్తున్న ప్రచారానికి ఆయనకు మంచి స్పందన కూడా వచ్చింది. ఈ ప్రయత్నాల వల్ల పిచ్చుకల సంఖ్య మునుపటి కంటే ఇప్పుడు పెరిగాయి అని స్థానికులు చెప్పారు.కొలి మేరుకు చెందిన సత్యవతి, మాస్టారు చెప్పిన తర్వాత మేము కూడా నేర్చుకున్నాము. పక్షుల సంఖ్య చాలా వరకు పెరిగింది.మా వ్యవసాయ భూములు కూడా చాలా బాగున్నాయి.
మేము కూడా ఇవి నేర్చుకొని చేస్తున్నాం అని చెప్పారు. 2012 నుంచి పిచ్చుకల పరిరక్షణతో పాటుగా జీవవైవిద్యం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం ఆయనకు పలు అవార్డులను సత్కరించింది. 2019 నుంచి హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ఈ ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేసినట్లు దాలినాయుడు తెలిపారు.