గురు పౌర్ణమి వేడుకలకు శ్రీ గురు పీఠంలో ఘన ఏర్పాట్లు
మహా రుద్రాభిషేకం, దత్తాత్రేయ హోమం, గురు చరిత్ర పారాయణం.. భక్తులకు ట్రస్ట్ ఆహ్వానం

శివ్వంపేట, జులై 26 (క్విక్ టు డే న్యూస్):
ఆషాడ శుద్ధ పూర్ణిమ సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న గురు పౌర్ణమి మహోత్సవాలకు శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఘన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శ్రీ గురు పీఠంలో రోజంతా ఆధ్యాత్మిక, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.బ్రహ్మశ్రీ శ్రీ శాస్త్రుల వామన శర్మ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితుల సమక్షంలో మహా రుద్రాభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామి మహాపూజ, శతనామార్చన, మహామంగళహారతి నిర్వహించనున్నారు. అనంతరం గురు స్తోత్రాల పఠనం, శ్రీ గురు చరిత్ర పారాయణం, శ్రీ దత్తాత్రేయ స్వామి మూలమంత్రంతో హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా జరుగనున్నాయి.అదే రోజు శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు కాకడ హారతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు మంగళస్నానం, 7.30 గంటలకు అర్చన, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు. సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి, రాత్రి 9 గంటలకు శేజ్ హారతితో కార్యక్రమాలు ముగుస్తాయి.గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. గురుభక్తితో పాల్గొనే ప్రతి భక్తునికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు




