ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీఎం
కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్‌కు నిరసనగా కొడంగల్‌లో భారీ ర్యాలీ

వికారాబాద్, జూలై 22 (క్విక్ టుడే న్యూస్):
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కొడంగల్‌లో నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేసి, పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో చర్చకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసుల చర్యలను ఖండించారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు.
2019 ఇంటర్ ఫలితాల అవకతవకలు, నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అంతకుముందు రేవంత్ రెడ్డి నివాసం నుంచి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




