మణుగూరులో 4.760 కిలోల గంజాయి స్వాధీనం

మణుగూరు, జూలై 27 (క్విక్ టుడే న్యూస్):
ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మణుగూరులో 4.760 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తితో పాటు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కిషన్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సి.హెచ్. శ్రీహరి రావు ఆధ్వర్యంలో సిబ్బంది అశ్వాపురం మండలం గొల్లగూడెం సీతారామ కాలువ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న హీరో గ్లామర్ (ఏపీ 24 AS 6802) ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 4.760 కిలోల ఎండు గంజాయి లభించింది. పోలీసుల వివరాల ప్రకారం, నల్గొండ జిల్లా హనుమాన్‌నగర్‌కు చెందిన జాల సందీప్ (ఏ1)తో పాటు ఓ మైనర్ కలిమెల నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ల మొత్తం విలువ సుమారు రూ.2.96 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను మణుగూరు ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుళ్లు వీరబాబు, ప్రసన్న కుమార్, తిరుపతి, ఉపేందర్ పాల్గొన్నారు.
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సమాచారం ఉన్నవారు టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2523కు సమాచారం అందించాలని, సమాచారదాత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.




