
వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్, జూలై 29:
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ ప్రాంతాల వైపు పయనిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో వచ్చే మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో ములుగు, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారంలో అత్యధికంగా 9.64 సెం.మీ. వర్షం కురిసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.





