
‘సిగ్మా’తో యాక్షన్ సినిమాలపై ఆసక్తి పెరిగింది: ఫరియా అబ్దుల్లా
నటి ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన చిత్రం ‘సిగ్మా’.
జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఫరియా చిత్ర విశేషాలను వెల్లడించారు.
‘‘జేసన్ నాకు ‘సిగ్మా’ కథ చెప్పిన తర్వాత ఆయన వయసెంత అని అడిగాను.
24 ఏళ్లని చెప్పారు.
ఆయనను చూసి చాలా స్ఫూర్తి పొందాను.
ఈ రంగంలో మరింత కష్టపడి పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు.
లైకా సంస్థ నిర్మిస్తున్న సినిమాతో తమిళంలో పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు.
సందీప్ కిషన్ తనను ఈ చిత్రానికి సిఫారసు చేశారని చెప్పారు.
తాను నటించిన ‘జాతిరత్నాలు’ సినిమాను జేసన్ ముందే చూడటంతో వెంటనే తనను పాత్రకు ఎంపిక చేశారని తెలిపారు.
‘సిగ్మా’ యాక్షన్, అడ్వెంచర్, హైస్ట్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఎంటర్టైనర్ అని ఫరియా చెప్పారు.
ఇందులో విభిన్న భావోద్వేగాలను ప్రదర్శించే అవకాశం లభించిందన్నారు.





