కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై ఇళ్ల కేటాయింపు కోరిన ముఖ్యమంత్రి

ఢిల్లీ, జూలై 28:
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, ఉపాధి హామీ పథకాల విస్తరణకు సంబంధించి కేంద్ర సహకారాన్ని కోరారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ గృహనిర్మాణ రంగం నిర్లక్ష్యానికి గురైందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) 2.0’ కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని కూడా కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించేలా ఈ పనులను పథకం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ కుటుంబాలు, రైతులను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
కూరగాయల పందిళ్ల ఏర్పాటు, పశుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణం, భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ పనులను ఉపాధి హామీ పరిధిలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న వ్యవసాయ భూముల పునరుద్ధరణ పనులను కూడా ఈ పథకంలో భాగం చేసి, రైతాంగానికి, గ్రామీణ ఉపాధి రంగానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు.




