
వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అధికార పార్టీ తీరుకు నిరసనగా విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ, జూలై29):
రాజ్యసభలో వందేమాతరం బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల సభలో ప్రవేశపెట్టగా, చర్చ అనంతరం ఆమోదించారు. వందేమాతరాన్ని అవమానించడం లేదా ఆలాపనకు ఆటంకం కల్పించడం నేరంగా పరిగణించేలా జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం–1971లో సవరణలు చేయనున్నారు. ప్రస్తుతం జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ విస్తరించడమే ఈ బిల్లు లక్ష్యం. చర్చ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యల అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఆందోళనలు కొనసాగడంతో, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లు ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.





