
జీవ వైవిధ్యంలో పులుల పాత్ర కీలకం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, జూలై29(క్విక్ టుడే న్యూస్):
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రకృతి, అటవీ సంరక్షణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. పులుల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తోందని, తూర్పు కనుమల్లో పులుల పునరావాసానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నల్లమల అడవుల్లో పులుల మనుగడను శాశ్వతంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పులి కేవలం జాతీయ జంతువు మాత్రమే కాకుండా అటవీ సంపద, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక అని స్పష్టం చేశారు. 2010లో ప్రారంభమైన ప్రపంచ పులుల దినోత్సవం సంరక్షణ అవసరాన్ని గుర్తుచేస్తోందన్నారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ వంటి కార్యక్రమాల ఫలితంగా ప్రపంచంలోని దాదాపు 75 శాతం పులులు భారత్లోనే ఉన్నాయని, ఇది దేశం సాధించిన విశిష్ట పర్యావరణ విజయమని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.




