కొలంబియాను కుదిపేసిన భారీ భూకంపం.. 132కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: కొలంబియాలో సంభవించిన శక్తివంతమైన భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు 132 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 570 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక, రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం కేంద్రం చోకో ప్రాంతంలోని శాన్ జోసె డెల్ పాల్మార్ సమీపంలో గుర్తించారు. భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం కాలీ, పెరీరా, మానిజాలెస్, బొగోటా సహా కొలంబియాలోని పలు ప్రాంతాల్లో కనిపించింది. పొరుగుదేశాల్లోనూ భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. కాలీలోని ఓ ఆసుపత్రిలో చిన్నారులు, నవజాత శిశువులకు సంబంధించిన విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న పలువురిని రక్షణ సిబ్బంది బయటకు తీసుకురాగా.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొందరు రోగులను ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాలీలో ఆసుపత్రుల మౌలిక వసతుల్లో దాదాపు 30 శాతం వరకు నష్టం వాటిల్లినట్టు స్థానిక అధికారులు తెలిపారు. పెరీరా, కాలీ నగరాల్లో భవనాలు కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మానిజాలెస్లోని చారిత్రక కేథడ్రల్కు చెందిన ఓ టవర్ కూలిపోయింది. అనేక ఇళ్లు, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, విద్యాసంస్థలు కూడా భూకంప ప్రభావానికి గురయ్యాయి. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కొలంబియా ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు సైనిక బలగాలను రంగంలోకి దించింది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా సజీవంగా వెలికితీయడమే తమ ప్రధాన లక్ష్యమని అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్పియ్రెల్లా తెలిపారు. సైన్యం ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బందితో పాటు శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అధునాతన పరికరాలు, శిక్షణ పొందిన శునక దళాలను వినియోగిస్తోంది. అయితే మారుమూల ప్రాంతాల్లో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భూకంప ప్రభావంతో పశ్చిమ కొలంబియాలోని పలు విమానాశ్రయాల్లో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పెరీరా, మానిజాలెస్, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా తదితర విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. కొన్ని విమానాశ్రయాల్లో అత్యవసర వైద్య, ప్రభుత్వ విమానాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మరోవైపు, కొలంబియాకు అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. ఈక్వెడార్ 47 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు శిక్షణ పొందిన శునకాలు, ప్రత్యేక సహాయక పరికరాలను పంపేందుకు సన్నద్ధమైంది. ఎల్ సాల్వడార్, మెక్సికోతో పాటు అమెరికా కూడా అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి.





