దాడులు చేస్తున్నా కానరాని మార్పులు
క్లౌడ్ కిచెన్ సెంటర్లో కాలం చెల్లిన పదార్థాలు.. దాడుల్లో గుర్తించిన అధికారులు

హైదరాబాద్, జూలై10(క్విక్ టుడే న్యూస్):
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ క్లౌడ్ కిచెన్‌లో కుళ్ళిపోయిన, గడువు ముగిసిన పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. వరుస దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు కానరావడం లేదు. కొండాపూర్‌లోని ’రెబెల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే క్లౌడ్ కిచెన్ సెంటర్ నుండి ఓవెన్ స్టోరీ, బెహ్రూజ్ బిర్యానీ, ఫాసోస్, స్వీట్ ట్రూత్, వెండీస్, లంచ్‌బాక్స్ వంటి చాలా బ్రాండ్ల పేర్లతో ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. అయితే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేప్టీ బృందం ఇక్కడ తనిఖీలు చేసింది. గడువు ముగిసిపోయిన పెరుగు ప్యాకెట్లను, గ్రేవీని అధికారులు గుర్తించారు. ఈ పాడైపోయిన పెరుగుతోనే కస్టమర్ల కోసం మజ్జిగ తయారు చేస్తున్నట్లు కనిపెట్టారు. కిచెన్ పరిసరాల్లోని వాష్ రూమ్‌లు/స్నానాల ప్రదేశాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్లలో మార్చినట్లు అధికారులు గుర్తించారు. అసలు మెడికల్ రిపోర్టులకు, వీరు చూపించిన సర్టిఫికెట్లకు అస్సలు సంబంధం లేదు. ఈ లోపాలు ఉన్న... అక్కడ కొన్ని మంచి పద్ధతులు కూడా కనిపించాయి. వంటల్లో కృత్రిమ రంగులు వాడకపోవడం, వంట చేసేవాళ్లు హెయిర్నెట్లు ధరించడం, నూనె నాణ్యతను పరీక్షించడం వంటివి బాగున్నాయి. దీంతో పరిశుభ్రత రేటింగ్‌లో ఈ అవుట్లెట్కు 100కి 78 మార్కులు వచ్చాయి. అధికారులు గడువు ముగిసిన వస్తువులన్నింటినీ అక్కడికక్కడే పారవేయించారు. లోపాలన్నింటినీ తక్షణమే సరిదిద్దుకోవాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల వ్యవహారంపై విడిగా విచారణ జరుపుతామని చెప్పారు. సైబరాబాద్ వ్యాప్తంగా హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, ఇన్‌స్టామార్ట్ గోడౌన్లు, కాలేజీ మెస్‌లలో సీఎంసీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని ఘోరాలు బయటపడ్డాయి. రెయిన్బో విస్టాస్ రెస్టారెంట్లో ఎలుకల రెట్టలు, కుళ్ళిపోయిన పుట్టగొడుగులు దొరికాయి. మాదాపూర్ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల సెంట్రల్ కిచెన్ పరిసరాల్లో పిల్లి మలం, వీధి కుక్కలు తిరుగుతూ కనిపించాయి. గజులరామారం ఇన్‌స్టామార్ట్ గోడౌన్లో ఎక్స్పైరీ అయిపోయిన చీజ్, పెరుగు నిల్వ ఉంచారు. కొంపల్లి రిలయన్స్ స్మార్ట్ బజార్లో గడువు ముగిసిన ప్యాకెట్లు, పురుగులు పట్టేసిన సరుకులు కనిపించాయి. చాలా చోట్ల ఆహార పదార్థాలు తయారుచేసే సిబ్బందికి కనీస వైద్య ధృవీకరణ పత్రాలు లేకపోవడం లేదా గడువు ముగిసిపోవడం వంటి తప్ప్పులు పదే పదే జరుగుతున్నట్లు అధికారులు మండిపడ్డారు.

