నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

ఆదిలాబాద్, జూలై17(క్విక్ టుడే న్యూస్):
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం కమిషన్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. మెశ్రం వంశీయుల పెద్దలు నాగోబా దేవాలయ చరిత్ర, మెశ్రం వంశీయుల సంప్రదాయాలు, నాగోబా జాతర విశిష్టత, గిరిజనుల ఆచార వ్యవహారాల గురించి కమిషన్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ నాగోబా దేవాలయం తెలంగాణ గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. నాగోబా జాతర దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి ప్రతిబింబమని, గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే గొప్ప వారసత్వమని పేర్కొన్నారు. గిరిజన సమాజం తమ మూలాలను, సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అనంతరం కమిషన్ సభ్యులు ఆలయ పరిసరాలను పరిశీలించి, దేవాలయ విశిష్టతతో పాటు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యులు, మెశ్రం వంశీయుల పెద్దలు, ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




