మోదీ పాలనలో తీవ్ర సంక్షోభంలోకి దేశం
అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్

నల్లగొండ, జూలై17(క్విక్ టుడే న్యూస్):
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ విమర్శించారు. నల్లగొండ పట్టణంలోని ఏచూరి భవన్లో శుక్రవారం నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలను ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 24 వరకు నల్లగొండలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, ఆదివాసీ రైతులు, మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో లక్షలాది మంది రైతులు, వ్యవసాయ రంగానికి చెందిన ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమం ఫలితంగా వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే బీహార్ ఎన్నికల అనంతరం అదే చట్టాలను మరో మార్గంలో అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ జూలై 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ సభ, ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సరళీకరణ విధానాలకు నిరసనగా ఆగస్టు 10న దేశవ్యాప్తంగా కార్మిక–కర్షక ఐక్యతతో "జైల్ భరో" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాల్లో 736 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని విజ్జు కృష్ణన్ తెలిపారు. అమెరికా, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాల నుంచి పత్తి, సోయాబీన్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. న్యూజిలాండ్ నుంచి పాల దిగుమతులు పెరిగితే భారత పాల ఉత్పత్తిదారుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా పోరాటాలు చేయాలని విజ్జు కృష్ణన్ పిలుపునిచ్చారు.




