పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా కొనసాగాలి
పార్లమెంట్ ముందు మీడియాతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై20:
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్మాణాత్మకంగా, సజావుగా కొనసాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉభయ సభల్లో సార్థక చర్చలు జరగాలని కోరారు. గందరగోళానికి తావులేకుండా సమావేశాలు విజయవంతంగా సాగితే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో భారత్ పలు రంగాల్లో విశేష విజయాలు సాధించిందని మోదీ తెలిపారు.
ముఖ్యంగా అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, భారతీయ స్టార్టప్ సంస్థ స్కైరూట్ విజయవంతంగా ప్రయోగించిన ‘విక్రమ్-1’ రాకెట్ దేశానికి గర్వకారణమని అన్నారు. ఈ విజయానికి యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తల కృషి కారణమని కొనియాడారు. స్కైరూట్ బృందం సగటు వయసు కేవలం 28 ఏళ్లేనని, భారత యువత ప్రతిభ ప్రపంచానికి మరోసారి చాటిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని పరోక్షంగా ఉద్దేశిస్తూ మోదీ చురకలంటించారు. “నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు. నిజంగా యువత సాధించిన ఘనత గురించే చెబుతున్నాను” అని వ్యాఖ్యానించారు.
భారత యువత సామర్థ్యానికి అంతరిక్షమే హద్దు కాదని, వారి ఆకాంక్షలు మరింత ఎత్తుకు చేరుకుంటాయని అన్నారు. ఇటీవల దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. రాజస్థాన్‌లో దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని అంకితం చేశామని, సెమీకండక్టర్ ప్లాంట్‌తో పాటు గ్రీన్ హైడ్రోజన్ రైలును ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ 7.7 శాతం వృద్ధిరేటు నమోదు చేయడం దేశ ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. వర్షాకాలం, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రెండూ చురుగ్గా సాగితే దేశానికి శ్రేయస్సు కలుగుతుందని మోదీ అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఉభయ సభల్లో విస్తృతంగా చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.




