మహిళా ప్రిన్సిపాల్ దారుణ హత్య
ఒంటరిగా ఉన్న రూపారెడ్డిపై కత్తితో గుర్తు తెలియని వ్యక్తి దాడి

దేవరకొండ, ఆగస్టు12 (క్విక్ టుడే న్యూస్):
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది.స్థానిక జేబీ హిల్స్‌లో మంగళవారం రాత్రి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రూపారెడ్డి (45)ని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. మృతురాలు కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఘటనతో పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రూపారెడ్డి భర్త రా జేందర్‌రెడ్డి వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారి కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో రూపారెడ్డి ఒక్కరే ఉన్న సమ యంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం లోపలి నుంచి మూసి ఉండగా.. వెనుక భాగంలోని తలుపు నుంచి నిందితుడు పరారైనట్లు ఆనవాళ్లు గుర్తించారు.
దొంగతనం కోసమా?
ఇంట్లోని వస్తువులు ఏవీ చోరీకి గురికాకపోవడంతో దొంగతనం కోసం వచ్చిన వ్యక్తులు ఈ హత్యకు పాల్పడి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూపా రెడ్డికి పరిచయం ఉన్న వ్యక్తులే హత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా.. మరేదైనా కారణమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
భర్త ఫోన్‌తో వెలుగులోకి..
బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఉన్న భర్త రాజేందర్ రెడ్డి భార్యకు పలుమా ర్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని కోరారు. వారు ఇంటికి వెళ్లి పరిశీలించగా రూపారెడ్డి మృతిచెంది ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
డాగ్ స్క్వాడ్ దర్యాప్తు..
సమాచారం అందుకున్న దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





