
రూ.1.03 లక్షల కోట్లతో రామాయపట్నం రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతి, అక్టోబర్ 5 (క్విక్ టుడే న్యూస్):
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కీలక అనుమతి లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం సిఫారసు చేసింది. సుమారు రూ.1,03,408 కోట్ల అంచనా వ్యయంతో 5,200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఏడాదికి 9 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రిఫైనరీని నిర్మించనున్నారు. ఇందులో ఇంధనాలు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ప్రాజెక్టు విస్తీర్ణంలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి కేటాయించడంతో పాటు పర్యావరణ నిర్వహణకు రూ.3,022 కోట్లు వెచ్చించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన జోన్లు, మెరైన్ క్రూడ్ ఆయిల్ టెర్మినల్ కూడా ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.



