తెలంగాణ అభివృద్ధికి రూ.30 వేల కోట్ల సాయం అందించాలి
కేంద్రానికి కాంగ్రెస్ పీఏసీ డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 22 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితుల నివారణకు రూ.30 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి, అన్ని విధాలుగా సహకరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అలాగే, 2027 జనగణనలో ఓబీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, ప్రశ్నావళిలో ఇందుకు అవకాశం కల్పించాలని కోరుతూ తీర్మానం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం పీసీసీ అధ్యక్షుడి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్చార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్‌కు స్వాగతం పలుకుతూ కమిటీ తీర్మానం చేసింది. పార్టీకి గతంలో ఇన్చార్జిగా సేవలందించిన మీనాక్షి నటరాజన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం ఆమోదించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ, ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచాలని సమావేశంలో చర్చించారు. మండల, గ్రామ, పట్టణ, వార్డు స్థాయిలో కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయడంతోపాటు అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలని నిర్ణయించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నాయకులకు సూచించారు. కేంద్ర బీజేపీ నేతల తెలంగాణ పర్యటనల నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఏసీ పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని తీర్మానించింది. డిసెంబర్ 7తో ప్రజా ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీఏసీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న సభలో తెలంగాణ కాంగ్రెస్ భాగస్వామ్యంపైనా సమావేశంలో చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని కాంగ్రెస్ నూతన ఇన్చార్జి బి.ఎం. సందీప్ ప్రశంసించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు నాయకుల మధ్య సమన్వయం పెంపొందించడంపై ఆయన దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా త్వరలో రాష్ట్రంలోని ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నారు.



