
భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
విజయవాడ, జూలై24(క్విక్ టుడే న్యూస్):
ఆషాఢ మాస శుక్రవారం, సారె ఉత్సవాలు ఒకేసారి రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని సారెలు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈవో వి.కె. శీనా నాయక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతరాలయ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసి సామాన్య భక్తులకు ముఖమండప దర్శనం కల్పించారు. ప్రత్యేక క్యూలైన్లతో భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 42 సారె బృందాల ద్వారా 16,890 మంది మహిళలు సారె సమర్పించారు. ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,94,030 మంది మహిళలు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఈవో తెలిపారు. మరో 20 రోజుల్లో సుమారు మూడు లక్షల మంది సారె సమర్పించే అవకాశం ఉందని అంచనా వేశారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


