
పోలీస్ వ్యవస్థ మరింత ఆధునికంగా మారాలి: సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ పోలీస్ రిట్రీట్–2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసులు తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారం వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని చెప్పారు. ‘ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్’ విధానంతో ప్రజల్లో భద్రతాభావం పెంపొందించాలని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడంతో పాటు నేరస్థులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే నేరాలు తగ్గుతాయని చంద్రబాబు అన్నారు. పాస్టర్ ప్రవీణ్ ఘటనలో జరిగిన దుష్ప్రచారాన్ని పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారని ఆయన అభినందించారు. రాష్ట్రంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజంపై కఠిన చర్యలు కొనసాగించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సీఎం సూచించారు.





