సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. షావుకారు జానకి మృతి విషయాన్ని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ అధికారికంగా వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి చెన్నై తేనాంపేటలోని సెనోటాఫ్ రోడ్లో ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితుల సందర్శనార్థం ఉంచనున్నట్లు తెలిపారు.
1931 డిసెంబర్ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో టేకుమళ్ల జానకిగా జన్మించిన ఆమె.. విజయా సంస్థ నిర్మించిన ‘షావుకారు’ చిత్రంతో 1950లో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తొలి చిత్రమే ఆమెకు గుర్తింపుగా మారడంతో ‘షావుకారు జానకి’గా ప్రాచుర్యం పొందారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 380 చిత్రాల్లో నటించారు. నాయికగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాలుగు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఆమె చివరిసారిగా 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో కనిపించారు. కళారంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. షావుకారు జానకి మృతితో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.





