
కతువా సీఐఎస్ఎఫ్ క్యాంపులో తోటి సిబ్బందిపై కాల్పులు.. నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్, సెప్టెంబర్30:
జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో సీఐఎస్ఎఫ్ క్యాంపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. బసోహ్లీ హిల్స్‌లోని సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న క్యాంపులో మంగళవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్ తన తోటి సిబ్బందిపై ఏకే-47తో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు రఫిక్ అహ్మద్, సందీప్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 150 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌పీసీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు. సిబ్బంది మధ్య తలెత్తిన వివాదమే కాల్పులకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవధేష్ కుమార్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.



