పెద్ది కుటుంబానికి అండగా ఉంటా
పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు హాజరైన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

వరంగల్, (క్విక్ టుడే న్యూస్):
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లబెల్లి మండలంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ఆయనకు నివాళులర్పించారు. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతికి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువులు, భవిష్యత్ ప్రణాళికలు, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన బాధ్యతలను బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారన్న సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసం వద్ద రద్దీ నెలకొంది. కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసీఆర్ కాన్వాయ్‌ను సురక్షితంగా నివాసంలోకి పంపించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ భవిష్యత్‌కు భరోసా కల్పించేలా బీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికే రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయన ఇద్దరు పిల్లల పేరిట చెరో రూ.1 కోటి చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు చెక్కులను అందజేశారు. అలాగే సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ సంక్షేమం, వైద్య ఖర్చుల కోసం మరో రూ.25 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి చెక్ అందించారు. కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా, పిల్లల విద్య, భవిష్యత్ అవసరాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.





