భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
తెలంగాణ ప్రాజెక్టుల్లో భారీ వరద ప్రవాహం

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకోగా, సుమారు 9,74,666 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతి కారణంగా భద్రాచలం కల్యాణకట్టతో పాటు స్నాన ఘట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే ప్రజలు ఎవరూ గోదావరి తీరాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 74,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1069.20 అడుగుల వద్ద ఉంది. 80.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 21.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1,46,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 28 గేట్లను ఎత్తి 1,33,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ ప్రవాహం శ్రీశైలం జలాశయానికి నిరంతరంగా చేరుతోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, కడెం జలాశయం నుంచి నీటి విడుదల కారణంగా భారీగా ఇన్ఫ్లో నమోదవుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లను తెరిచి 1,08,493 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,21,354 క్యూసెక్కులుగా ఉంది. 20.175 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 18.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది.




