
పకడ్బందీగా ఉద్యోగ నియామకాలు.. పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియపై సీఎం ఆదేశాలు
పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
7,437 పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర శక్తులు నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని నిఘా వర్గాలు సీఎంకు నివేదించాయి.
దీంతో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు.
ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా నుంచి పరీక్షల నిర్వహణ వరకు అన్ని దశల్లో కట్టుదిట్టమైన భద్రత, నిబంధనల అమలును నిర్ధారించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల భద్రతతో పాటు కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.




