సింగీతం శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు

భారతీయ సినీ రంగంలో తనదైన శైలితో చెరగని ముద్ర వేసిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం సాయంత్రం చెన్నైలోని నేసపాక్కం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన సింగీతం మృతితో ఓ మహోన్నత సినీ అధ్యాయం ముగిసింది. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాసరావు (94) చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని విరుగంబాక్కంలోని నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచే సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.




