రాత్రికి రాత్రే సముద్రం ఖాళీ.. 23 కి.మీ. వెనక్కి వెళ్లిన నీరు!
బ్యూనస్ ఎయిర్స్, సెప్టెంబర్ 12 (క్విక్ టుడే న్యూస్):
సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోవడంతో అర్జెంటీనాలోని మార్ డెల్ ప్లాటా తీరంలో ఆశ్చర్యకర దృశ్యాలు కనిపించాయి. సాధారణంగా సముద్రపు నీటిలో మునిగి ఉండే ప్రాంతాలు బయటపడటంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. సముద్రం ఏకంగా 23 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిందంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్గా మారాయి. మార్ డెల్ ప్లాటా తీరంలో సముద్రపు నీరు ఒక్కసారిగా వెనక్కి తగ్గడంతో సముద్రగర్భం బయటపడింది. నీటిలో కనిపించని పడవలు, రాతి నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సముద్రంలో ఉండే ‘రెస్టింగా డెల్ ఫారో’ రాతి నిర్మాణాలు స్పష్టంగా కనిపించడంతో అక్కడ కొత్త ద్వీపం ఏర్పడిందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. భూభాగం నుంచి సముద్రం వైపు వీచిన బలమైన గాలులు, అల్పపీడన పరిస్థితులు, సముద్రపు ఆటుపోట్లలో వచ్చిన మార్పులు నీటి మట్టం తాత్కాలికంగా తగ్గడానికి కారణమయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.




