
హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై క్షిపణి దాడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 6:
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఆన్ పీస్ వాణిజ్య నౌకపై మంగళవారం క్షిపణి దాడి జరిగింది. నౌకలోని 19 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉండగా.. 12 మంది గాయపడ్డారు. వారిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒమన్ అధికారుల సహకారంతో క్షతగాత్రులను సురక్షితంగా తరలించి ఖసబ్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వాణిజ్య నౌకలు, నావికులపై దాడులను వెంటనే నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది. సముద్ర మార్గాల్లో భద్రత, స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదే సమయంలో మరో నౌకను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించి వెనక్కి మళ్లించినట్లు యూకేఎంటీఓ తెలిపింది. నల్లసముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడినీ భారత్ ఖండించింది.



