మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం కల్లోలం.. సాగర్ జిల్లాలో 12 మంది మృతి

పాట్నా, సెప్టెంబర్ 6:
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో అనుమానాస్పద కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విషపూరిత మద్యం సేవించినట్లు అనుమానిస్తున్న 12 మంది మృతి చెందగా, మరో 10 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అనుమానాస్పద మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు సాగర్ జిల్లాలో అక్రమ, నకిలీ మద్యం విక్రయాలపై గతంలోనే ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘బాంబే విస్కీ’ పేరుతో నకిలీ మద్యం విక్రయిస్తున్నారంటూ ఓ మద్యం కాంట్రాక్టర్ ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల లైసెన్స్ పొందిన మద్యం కాంట్రాక్టర్లు సైతం ఎక్సైజ్ అధికారులతో జరిగిన సమావేశంలో నకిలీ మద్యం విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్వస్థతకు గురైన బాధితుల్లో శరీరం నీలంగా మారడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు.



