ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. సత్య నికేతన్‌లో ముగ్గురు మృతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6:
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతు పనులు జరుగుతున్న ఐదంతస్తుల పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు మృతి చెందారు. సహాయక బృందాలు ఇప్పటివరకు ఆరుగురిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతిగృహంగా వినియోగిస్తున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి ఐదు అంతస్తులు ఉన్న ఈ భవనంలో ప్రమాదం జరిగిన సమయంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల నుంచి వెలికితీసిన ఓ వ్యక్తిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. భవనం సమీపంలోని పీజీల్లో విద్యార్థులు నివసిస్తుండటంతో మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా మాట్లాడుతూ.. ఇది రాజకీయ విమర్శలకు సమయం కాదని, అయితే ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీజీలు ఏ నిబంధనలతో కొనసాగుతున్నాయి, భవనాల లేఅవుట్, అగ్నిమాపక భద్రత అనుమతులను ఎవరు ఇస్తున్నారనే అంశాలపై విచారణ జరపాలని కోరారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనను తీవ్ర విషాదంగా పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తూ, పౌరుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అతిషి కూడా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాద సమయంలో సమీపంలో ఉన్న విద్యార్థులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భవనం ఒక్కసారిగా కంపించినట్లు అనిపించిందని, కొద్దిసేపటికే దుమ్ము కమ్ముకోవడంతో భవనం కూలిపోయిన విషయం తెలిసిందని ఓ విద్యార్థి చెప్పారు. అధికారుల బృందాలు చేరుకునేలోపే స్థానికులు ఒకరిని శిథిలాల నుంచి బయటకు తీసినట్లు తెలిపారు.



