దేశాభివృద్ధే లక్ష్యం.. రాష్ట్రాల బలోపేతమే మార్గం : ప్రధాని మోదీ

దేశాభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తయారీ రంగంలో సాధిస్తున్న పురోగతి, మౌలిక సదుపాయాల విస్తరణ దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్ ఎదిగిందని, 2014తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని వెల్లడించారు. రక్షణ ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఆదివారం చెన్నైలో రూ.13 వేల కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, మెట్రో రైలు, పెట్రోలియం, విద్య తదితర రంగాలకు చెందిన ప్రాజెక్టులు తమిళనాడు అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. వీటి ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు పరిశ్రమలు, వాణిజ్యం విస్తరిస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ప్రభుత్వాధినేతగా తన సుదీర్ఘ ప్రస్థానంలో రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చానని మోదీ గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం రాష్ట్రాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాలు దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. తమిళనాడు పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, చిన్న తరహా సంస్థలు, వాటిలో పనిచేస్తున్న కార్మికుల కృషి దేశ తయారీ రంగానికి బలాన్నిస్తోందన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రభుత్వాలు మారినా ఆ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల తన నిబద్ధతలో మార్పు లేదని ప్రధాని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధి, జయలలితలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పన్నీర్‌సెల్వం, పళనిస్వామి, ఎం.కె. స్టాలిన్‌లతోనూ పనిచేశానన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పారు. పట్టణీకరణను సవాలుగా కాకుండా అభివృద్ధికి అవకాశంగా చూడాలని మోదీ సూచించారు. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రహదారులను విస్తరించడం ఒక్కటే సరిపోదని, ఆధునిక నగరాలకు సమగ్ర మౌలిక సదుపాయాలు అవసరమని చెప్పారు. 2014లో దేశంలోని ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో రైలు సేవలు ప్రస్తుతం 25 నగరాలకు విస్తరించాయని వివరించారు. దేశవ్యాప్తంగా మెట్రో నెట్వర్క్ విస్తరణతో ప్రయాణ సమయం తగ్గి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. చెన్నై మెట్రో రెండో దశలోని పూనమల్లి–వడపళని మార్గాన్ని ప్రారంభించడం నగర రవాణా వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు. దేశీయ తయారీ రంగం విస్తరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని ప్రధాని తెలిపారు.



