
ఆల్ ఇండియా రేడియో ప్రాంగణంలో రాహుల్ బైఠాయింపు.. సీఈసీకి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ, అక్టోబర్06:
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రబిందువుగా నిలిచారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరిన రాహుల్‌తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఎంపీలు ఆకాశవాణి భవన్ సమీపంలో బైఠాయించారు. ఈ సందర్భంగా రాహుల్ బారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండాను ఊపారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ఆల్ ఇండియా రేడియో ప్రాంగణంలోకి వెళ్లి చెట్టు కింద బైఠాయించారు. సీఈసీని కలిసి ‘ఓట్ల చోరీ’పై ప్రశ్నించేందుకే తన నిరసన అని రాహుల్ తెలిపారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ కూడా ధర్నాలో పాల్గొన్నారు. అఖిలేశ్ యాదవ్, అభిషేక్ బెనర్జీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. మరోవైపు రాహుల్ నిరసనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.



