
రాజీనామానా?.. తొలగింపా?.. కొండా సురేఖ వ్యవహారంపై ఉత్కంఠ..
హైదరాబాద్, సెప్టెంబర్2(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడం కంటే గౌరవప్రదంగా రాజీనామా చేయించేందుకు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని నివేదించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారశైలితో పాటు మంత్రుల పనితీరుపై నివేదిక అందజేసినట్లు సమాచారం. అధిష్ఠానం పిలుపుతో కొండా సురేఖ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు భరోసా ఇచ్చి రాజీనామా చేయించేందుకే పిలిపించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వేణుగోపాల్ పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనంతరం సురేఖపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చ జరుగుతున్నా సురేఖ అంశానికే ప్రాధాన్యం.





