భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రండి
ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

చంద్రబాబు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ సానుకూలంగా స్వీకరించినట్లు సమాచారం. సుమారు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, దేశ రాజకీయ పరిస్థితులు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు కూడా ప్రధానిని కలిశారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని భోగాపురం విమానాశ్రయం పరిధి ఎంపీగా చంద్రబాబు ప్రధానికి పరిచయం చేశారు. అప్పలనాయుడు ప్రతిరోజూ సైకిల్‌పై పార్లమెంటుకు వస్తున్నారని పేర్కొంటూ ప్రధాని మోదీ ఆయనను అభినందించినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పారిశ్రామిక పెట్టుబడులు, పొగాకు రైతులు, ఆక్వా రంగానికి సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది.
అనంతరం కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో అమలవుతున్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర సహకారం అవసరమైన అంశాలపై చర్చించారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన సమావేశంలో గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రధాన చర్చాంశంగా నిలిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం మార్గం కంటే బనకచర్ల ద్వారా కావేరీ అనుసంధానం మరింత అనుకూలమని జల్ శక్తి శాఖ సూచించినట్లు సమాచారం. సముద్రంలోకి వృథాగా వెళ్లే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా అన్ని రాష్ట్రాల అంగీకారంతో ముందుకు వెళ్లాలని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

