కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, సెప్టెంబర్07(క్విక్ టుడే న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శైలజకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను ప్రకటించి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజులు పూర్తయినా అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్లు
మహాలక్ష్మి పథకం:
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీల పంపిణీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు, ఆడబిడ్డలకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు.
రైతాంగానికి భరోసా:
ప్రతి పంటకు రైతు భరోసా, బోనస్ అందించాలని, ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందించాలని కోరారు.
నిరుద్యోగులు, విద్యార్థులు:
అర్హులైన యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యా భరోసా పథకాన్ని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
సంక్షేమ పథకాలు:
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు పెంచుతామని ప్రకటించిన రూ.4,000 పింఛన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందించాలని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.
పారిశుద్ధ్యం, పాలన:
పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారిందని ఆరోపిస్తూ, వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 420 హామీలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని జక్క వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్, కొల్తూరి మహేష్, లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, కౌడే పోచయ్య, మధుసూదన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ప్రభు, శ్యామల శ్రీనివాస్, యూబీఏ అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, బుల్లెట్ శంకర్, జిలాని పాషా, కిరణ్ నాయక్, అమర్ పటేల్, చిరంజీవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



