ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 24 (క్విక్ టుడే న్యూస్):
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. అట్రాసిటీ కేసుల్లో విచారణ, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్లు కె. కిరణ్మయి, చంద్రారెడ్డి, డీసీపీ కె. నారాయణరెడ్డితో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించేందుకు పోలీసు, రెవెన్యూ, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వెంకటయ్య సూచించారు. అట్రాసిటీ కేసుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అంతకుముందు ఐడీఓసీకి చేరుకున్న చైర్మన్కు అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, డీఎంసీ సభ్యులు, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.



