
మైనర్ బాలికను రక్షించిన శశికుమార్‌కు సీపీ సన్మానం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24 (క్విక్ టుడే న్యూస్):
ప్రమాదంలో చిక్కుకున్న మైనర్ బాలికను ధైర్యంగా రక్షించి, నిందితుడిని పోలీసులకు అప్పగించిన శశికుమార్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ రెడ్డి అభినందించి సన్మానించారు. ఆగస్టు 16న ఓ రెండేళ్ల బాలిక ఆర్తనాదాలు విన్న శశికుమార్ వెంటనే స్పందించారు. ఘటనాస్థలికి చేరుకుని బాలికను నిందితుడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు, నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆయన అప్రమత్తతతో చిన్నారికి ముప్పు తప్పింది. ఈ ఘటనలో శశికుమార్ చూపిన ధైర్యాన్ని ప్రశంసించిన సీపీ.. గంగారం చెరువు వద్ద ఆయనను శాలువాతో సత్కరించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని సూచించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన శశికుమార్ ధైర్యం, మానవత్వం సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని సీపీ పేర్కొన్నారు.



