బాలాజీ జ్యువెల్లర్స్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నలుగురు నిందితుల అరెస్ట్

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (క్విక్ టుడే న్యూస్):
చందానగర్ గౌతమి నగర్‌లోని శ్రీ బాలాజీ జ్యువెల్లర్స్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దుకాణం తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను అపహరించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఛోటూ అలియాస్ యోగేష్ మండేలియా, గోలు అలియాస్ రాజేష్ మండేలియా, అతుల్ శర్మ, శ్యామ్ సుందర్ కుష్వాహ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చోరీ అనంతరం దర్యాప్తు చేపట్టిన చందానగర్ క్రైమ్, CCS బృందాలు సుమారు 500 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించాయి. ఇదే సమయంలో మరో చోరీ కేసులో గ్వాలియర్ పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో, చందానగర్ పోలీసులు పీటీ వారెంట్ల ద్వారా తమ కస్టడీలోకి తీసుకున్నారు.విచారణలో చోరీ చేసిన సొత్తును మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా కథా గ్రామంలో దాచినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో సెప్టెంబర్ 13న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి 59.220 గ్రాముల కరిగించిన బంగారు బార్‌తో పాటు సుమారు 2 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో కిలో వెండిని విక్రయించినట్లు నిందితులు చెప్పడంతో, ఆ వెండిని కొనుగోలు చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ACP ఆర్సీ పురం డివిజన్ చ.వై. శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు ఎ. శ్రీధర్ కుమార్, కె. ప్రదీప్ కుమార్, డిటెక్టివ్ క్రైమ్ సిబ్బంది, CCS బృందాలు కేసు దర్యాప్తు చేపట్టాయి.



