
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
హైదరాబాద్, అక్టోబర్ 6:
లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధించడంతో పాటు బ్లాక్మెయిల్ చేశారన్న ఆరోపణలపై జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంతో పాటు తన ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పాలని బెదిరించారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఫోన్ చాటింగ్ వివరాలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. అనంతరం ఉదయ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 67 రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది.



