
మూసీ ప్రక్షాళనకు రైతులు సహకరించాలి
మేడిపల్లి, సెప్టెంబర్30(క్విక్ టుడే న్యూస్):
మూసీ నది ప్రక్షాళన, సమగ్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ భూముల సేకరణపై బుధవారం మేడిపల్లి మండలంలో రైతులతో నెగోషియేషన్ సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ నల్ల వెంకట్రెడ్డి, తహసీల్దార్ వెంకట్ నర్సింహరెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో భూసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవన ప్రాజెక్టుతో పరివాహక ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. భూములు కోల్పోయే రైతులకు చట్టప్రకారం పరిహారం, పునరావాస ప్రయోజనాలు అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. భూసేకరణలో రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి భూసేకరణకు సహకరించాలని రైతులను కోరారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, ప్రభావిత ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.




