నల్లగొండలో గణేష్ మండపాలపై ఎస్పీ స్పెషల్ ఫోకస్
బడి మానేసి మండపంలో ఉన్నవారికి కౌన్సెలింగ్

నల్లగొండ, సెప్టెంబర్ 16, (క్విక్ టుడే న్యూస్)
నల్లగొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మిశ్రమ జనాభా, సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పలు మండపాలను సందర్శించిన ఎస్పీ, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. ఈసారి ఉత్సవాల్లో మైనర్ విద్యార్థుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. పాఠశాలలు, కళాశాలలకు గైర్హాజరై గణేష్ మండపాల వద్ద ఉంటున్న విద్యార్థులను గుర్తిస్తే వారి తల్లిదండ్రులు, మండప నిర్వాహకుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి విద్య ప్రాముఖ్యతను వివరిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఉత్సవాలు జరుగుతున్నాయని చదువులకు ఆటంకం కలిగించవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపాలని కోరారు.
ప్రతి మండపానికి జియో ట్యాగింగ్ తప్పనిసరి
ప్రతి గణేష్ మండపాన్ని ఆన్లైన్లో నమోదు చేసి జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి. 24 గంటల పాటు వాలంటీర్లు అందుబాటులో ఉండాలి, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలి. ఫైర్ సేఫ్టీ, విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సౌండ్ సిస్టమ్ ను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం వరకే వినియోగించాలి. ఇతర మతాల మనోభావాలు దెబ్బతీసే పాటలు, నినాదాలు నిషేధం. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు. శాంతిభద్రతల పరిరక్షణకు సున్నిత ప్రాంతాల్లో నిరంతర నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ నాగరాజు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి , టూ టౌన్ ఎస్సై సైదా బాబు పాల్గొన్నారు.



