బడ్డెట్లో విద్యకు 15 శాతం నిధులే లక్ష్యం : శాసనసభ చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 11:
బడ్జెట్లో విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందనే నమ్మకంతో విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. అందరూ జెన్‌జీ గురించి ఆలోచిస్తున్న సమయంలో తాను జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నానన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో విద్యాశాఖపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు. విద్యారంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ విధానం ఉంటుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల డిప్లొమా కోర్సు, అకడమిక్ హోదా యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి తీసుకొస్తున్నామని వెల్లడించారు. సర్వీసు నిబంధనలను మార్చడం సాధ్యం కాదని, అలా చేస్తే న్యాయస్థానాల్లోనూ సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఏటీసీల భూములను ప్రభుత్వం తీసుకోలేదని, అదనంగా 282 ఎకరాలు కేటాయించామని సీఎం చెప్పారు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గత మూడేళ్లలో విద్యాశాఖపై అదనంగా రూ.7,554 కోట్లు ఖర్చు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా, తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, 55 రోజుల్లోనే 10,600 మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు.
ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేశామని పునరుద్ఘాటించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించిందని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రానికి హార్వర్డ్ వర్సిటీ రాబోతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. లండన్ వర్సిటీతో పాటు నార్త్ఈస్టర్న్, వర్జీనియా వర్సిటీలు కూడా తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు. పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణకు ఎలాంటి అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారం వంద శాతం అబద్ధమని కొట్టిపారేశారు. పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు పాలిటెక్నిక్‌లు ఎలా కొనసాగుతున్నాయో ఇకపై కూడా అలాగే ఉంటాయని తెలిపారు. మూడేళ్ల డిప్లొమా కోర్సుకు సంబంధించి జీవో 97లో అవసరమైన సవరణలు చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యకు రూ.18,955 కోట్లు కేటాయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26లో రూ.23,729 కోట్లు, 2026-27లో రూ.27,663 కోట్లు కేటాయించిందని సీఎం తెలిపారు. పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే కీలకమైన విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 28,163 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయని వెల్లడించారు.



