
ఫ్రాన్స్‌లోని గిరోండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు విధ్వంసం
పారిస్, జూలై31:
ఫ్రాన్స్‌లోని నైరుతి ప్రాంతం గిరోండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు రోజురోజుకూ ఉద్ధృతమవుతూ భారీ విధ్వంసం సృష్టిస్తోంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక కరువు, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పారిస్ నగర వైశాల్యానికి నాలుగు రెట్లకు సమానమైన విస్తీర్ణం అగ్నికి ఆహుతైందని వెల్లడించారు. ప్రమాద ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశముండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మంటలు అణు కేంద్రాలు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ యూనిట్లకు సమీపిస్తున్నాయి. కీలక రక్షణ, అణ్వాయుధ సంబంధిత కేంద్రాలకు ముప్పు తలెత్తకుండా ముందస్తు చర్యగా సమీపంలోని చెట్లను బుల్డోజర్లతో తొలగిస్తూ అగ్ని వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.





