‘నారాజ్ మామకు కూడా పని దొరికింది’
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌పై ప్రశ్నలు వేసేవారికి ప్రధాని మోదీ సెటైర్.

వడోదర, సెప్టెంబర్8:
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ వల్ల ట్రక్కుల అవసరం తగ్గితే డ్రైవర్లు, ట్రక్కుల యజమానుల పరిస్థితి ఏంటని ప్రశ్నించే వారికి ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అలాంటి వారిని ‘నారాజ్ ఫూఫా’ (అలకపాన్పు ఎక్కిన మేనమామ)గా అభివర్ణించిన ఆయన.. ఇప్పుడు ఆ ‘నారాజ్ ఫూఫాకు కూడా పని దొరికింది’ అంటూ చురకలు అంటించారు. ఎవరి పేరును ప్రస్తావించకుండానే ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వడోదరలో నిర్వహించిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో మోదీ పాల్గొని రూ.35 వేల కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 2047 నాటికి భారత్‌ను అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా నిలపడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
250 ట్రక్కుల సరుకు.. ఒకే రైలులో
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ సామర్థ్యాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ పలు ఉదాహరణలు ఇచ్చారు. ఇటీవల ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ నుంచి వడోదరకు డబుల్స్టాక్ కంటైనర్ రైలు నడిచిందని తెలిపారు. ఒకే రైలులో తరలించిన సరుకు 250కుపైగా ట్రక్కులు మోసే సామర్థ్యానికి సమానమని చెప్పారు. ఫ్రైట్ కారిడార్ ద్వారా సరుకు రవాణా వేగం పెరగడంతో పాటు ఇంధనం, సమయం, రవాణా ఖర్చులు ఆదా అవుతాయని మోదీ వివరించారు. గతంలో సరుకు రైలు 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి సుమారు 6.5 గంటలు పట్టేదని, ఇప్పుడు అదే దూరాన్ని సగం కంటే తక్కువ సమయంలో చేరుకుంటోందన్నారు. సాధారణంగా ట్రక్కుల ద్వారా 30 గంటలు పట్టే సరుకు రవాణా.. ఫ్రైట్ కారిడార్ ద్వారా 10 నుంచి 12 గంటల్లో పూర్తవుతోందని తెలిపారు. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
సరుకు రవాణాకు ‘లైఫ్‌లైన్’
తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు కలిపి 2,800 కిలోమీటర్ల పొడవు ఉన్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు కారిడార్లపై రోజుకు 430కుపైగా సరుకు రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. దేశ వాణిజ్యం, సరుకు రవాణాకు ఇవి వెన్నెముకగా మారుతున్నాయని, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు లైఫ్‌లైన్‌లా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రయాణికుల రైళ్లు, సరుకు రైళ్లు ఒకే ట్రాక్‌పై నడవడంతో రెండింటి వేగంపై ప్రభావం పడేదని మోదీ తెలిపారు. సరుకు రైళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రైట్ కారిడార్ అందుబాటులోకి రావడంతో ఈ సమస్య పరిష్కారమైందన్నారు.
2014 తర్వాత పనులకు వేగం
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వాల తీరును కూడా మోదీ విమర్శించారు. ఈ ప్రాజెక్టు ఆలోచన 2004లో ప్రారంభమైందని, 2006లో పనుల కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ 2014 వరకు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని అన్నారు. ఫైళ్లు ఏళ్ల తరబడి ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరుగుతూనే ఉండేవని ఎద్దేవా చేశారు.





