
ఆక్వా రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన వైఎస్ జగన్
మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి, జూలై1(క్విక్ టుడే న్యూస్):
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆక్వా రంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని కోరుకుంటున్నారని, దీంతో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపించారు. ఆక్వా రంగంపై జగన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన యనమల, అంతర్జాతీయ మార్కెట్లలో జరిగే మార్పులు దేశీయ మార్కెట్‌పై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసి, ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. అలాగే ఆక్వా రంగానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, రాయితీలను తొలగించడం వల్ల ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లు వృద్ధి చెందుతున్నప్పటికీ రాష్ట్రంలో ఆక్వా రంగం ఎందుకు క్షీణించిందో జగన్ సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.





