
శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి రూ.1,108 కోట్లు మంజూరు
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.1,108 కోట్లను మంజూరు చేసింది.
ఆలయ నిర్మాణంతో పాటు అనుసంధాన రహదారి పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ఆలయ కాంప్లెక్స్ నిర్మాణానికి సాంకేతిక సలహాలు, డిజైన్ల ఖరారు కోసం ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆలయ ఆర్కిటెక్చర్ పనులకు రూ.599 కోట్లు, సివిల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ తదితర పనులకు రూ.350 కోట్లు కేటాయించారు.
ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్ విండ్ విల్లాస్ వరకు గ్రేహౌండ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీదుగా ఆలయానికి చేరుకునేలా 2.5 కిలోమీటర్ల ఆరు లేన్ల, 100 అడుగుల రహదారి నిర్మాణానికి మరో రూ.160 కోట్లు మంజూరు చేశారు.
ఆలయ అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.



