డ్రగ్స్ అడ్డాగా గోవా.. బీజేపీ పాలనపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

గోవాలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ పాలనలో గోవా డ్రగ్స్ ముఠాలు, భూకబ్జాదారులకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న మాదకద్రవ్యాల్లో కొంత భాగం గోవా నుంచి వస్తున్నట్లు తమ దర్యాప్తులో గుర్తించామని పేర్కొన్నారు. డ్రగ్స్ సమస్య గోవా ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం గోవా కాంగ్రెస్ నిర్వహించిన ‘గోయ్ రాఖొన్న్’ (గోవాను కాపాడుకుందాం) యాత్రలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. కున్కోలిమ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్న వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘నషా ముక్త్ భారత్’ గురించి మాట్లాడుతున్నారని గుర్తుచేస్తూ.. గోవాలో డ్రగ్స్ సమస్యను ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో, గోవాలో బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ సమస్యతో పాటు గోవాలో భూముల పరిరక్షణ, ప్రభుత్వ భూముల వ్యవహారాలపైనా రేవంత్‌రెడ్డి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, యువత భవిష్యత్తు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గోవా ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. బీజేపీని రావణుడితో, కాంగ్రెస్‌ను రాముడితో పోలుస్తూ.. గోవాలో రాజకీయ పోరాటం ఈ రెండు పార్టీల మధ్యే ఉందని వ్యాఖ్యానించారు. 2027లో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గోవా భూములు, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.



