పదవులు శాశ్వతం కాదు.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా
వరంగల్‌లో కార్యకర్తల సమావేశంలో కొండా సురేఖ

వరంగల్, సెప్టెంబర్13(క్విక్ టుడే న్యూస్)::
మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత తొలిసారి వరంగల్‌లో కొండా సురేఖ, కొండా మురళి తమ అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల మధ్య చిరస్థాయిగా నిలవడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి వంటి మాస్ లీడర్ అవసరమని మొదట చెప్పింది తానేనని సురేఖ పేర్కొన్నారు. రైతుల కోసం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారని, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. తనకు అప్పగించిన మంత్రి బాధ్యతలను ఎలాంటి తప్పు లేకుండా నిర్వహించానని చెప్పారు. గతంలో తాము నమ్మిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని సురేఖ గుర్తుచేశారు. కొంతమంది తమకు టికెట్ రాకుండా అడ్డుకున్న సమయంలో కాంగ్రెస్‌లో అవకాశం దక్కలేదని, ఆ సమయంలో కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. ఆ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఆయనతో కలిసి పనిచేశామని, అప్పట్లో మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించి విజయం సాధించామని చెప్పారు. వరంగల్ ఈస్ట్‌లో తమ విజయంతో ప్రజల్లో భరోసా ఏర్పడిందని, కొండా మురళి ఉన్నారనే ధైర్యంతో అక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించేవారని సురేఖ అన్నారు. అనంతరం పరకాలకు వెళ్లినప్పుడు కూడా ప్రజలు తమను ఆదరించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాదం పెరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోల్పోయినంత మాత్రాన తాము ఇంటికే పరిమితం కాబోమని, ఎప్పటిలాగే ప్రజల మధ్యే ఉంటామని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వరంగల్ ఈస్ట్ నుంచి తనకే టికెట్ వస్తుందని కొండా సురేఖ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తాను మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై పెద్దగా బాధ లేదని, అయితే ఎలాంటి కారణం లేకుండా పదవి నుంచి తొలగించడమే బాధ కలిగించిందని సురేఖ పేర్కొన్నారు. పదవి నుంచి తొలగించిన అనంతరం కొందరు అల్లర్లు చేయాలని తనకు ఫోన్లు చేశారని వెల్లడించారు. అయితే అలాంటి చర్యలకు పాల్పడవద్దని వారిని తానే వారించానన్నారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలు, అనుచరులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.





