అవమానించింది నీ తల్లిని కాదు.. నా తల్లిని
హరీశ్‌రావుపై మండిపడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్8(క్విక్ టుడే న్యూస్):
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కాచెల్లెమ్మలకు జరిగిన ఘటనను చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. “అవమానించింది నీ తల్లిని కాదు.. నా తల్లిని” అంటూ హరీశ్‌రావును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలపై జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి గొంతునొక్కినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ సంబంధిత పోలీసులపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. అలాగే సునీతా లక్ష్మారెడ్డిని చీర లాగి అవమానించారని ఆరోపిస్తూ.. బాధితులపై కేసులు నమోదు చేసి వేధించడం ఏమిటని నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి వారిపైనే కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
అసెంబ్లీని గౌరవసభగా కాకుండా కౌరవ సభగా మార్చారని విమర్శించారు. కౌరవులకు పట్టిన గతే మీకూ పడుతుందని హెచ్చరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆయనంటే తనకు ఎంతో గౌరవం, ఇష్టమని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా సభలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అయితే తన వ్యాఖ్యలను స్పీకర్ తనను ఉద్దేశించినవిగా భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఎందుకు ప్రకటించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు అనుమతించకుండా తాళం ఎందుకు వేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.





