
రూ.63వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీడీపీవో
ఇంటర్నెట్ డెస్క్: జగిత్యాల జిల్లా మెట్పల్లి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) దరోజు పద్మను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం..
మెట్పల్లి పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి ఒక్కో కేంద్రానికి నెలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని పద్మ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తనిఖీల సమయంలో ప్రతికూల వ్యాఖ్యలు, నివేదికలు రాయకుండా ఉండేందుకు ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
21 కేంద్రాలకు సంబంధించిన మొత్తంగా రూ.63 వేల నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ట్రాప్ అనంతరం నిందితురాలి వద్ద నుంచి మొత్తం రూ.63 వేల లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.





