తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టులో ఊరట.. మండలిలో వేటు

హైదరాబాద్, సెప్టెంబర్8(క్విక్ టుడే న్యూస్)::
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పోలీసుల రిమాండ్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. ఇద్దరినీ విడుదల చేయాలని ఆదేశించింది. రూ.10 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని సూచించింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్యకర పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ స్పీకర్ ఓఎస్డీ సోమవారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా.. పోలీసుల రిమాండ్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అవసరమైన పూచీకత్తులు, ఇద్దరు షూరిటీలను సమర్పించిన అనంతరం వారిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.
శాసనసభలో తీర్మానం మరోవైపు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ తీర్మానించింది.
స్పీకర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం తీర్మానం ప్రతిని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి పంపించారు. మండలిలో సస్పెన్షన్ శాసనసభ తీర్మానం మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటింగ్ నిర్వహించగా.. తీర్మానం ఆమోదం పొందింది. దీంతో తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను ప్రస్తుత శాసనమండలి సమావేశాల సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం శాసనమండలి వాయిదా పడింది. ఒకవైపు న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించి ఎమ్మెల్సీల విడుదలకు ఆదేశించగా.. మరోవైపు శాసనసభ, శాసనమండలి చర్యలతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది.





